వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఆధునిక సమాచార సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి చేసిన విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. స్టేషన్‌లో చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న ఎలక్ట్రానిక్ కోచ్ గైడెన్స్, స్క్రోలింగ్ డిస్‌ప్లే బోర్డుల సమస్యను దక్షిణ కోస్తా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ, వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ లేఖ రాశారు.
ఈ లేఖకు స్పందించిన గుంతకల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ చంద్ర శేఖర్ గుప్తా, ప్రస్తుతం ఉన్న డిస్‌ప్లే బోర్డు వ్యవస్థ సాంకేతిక కారణాలతో పూర్తిగా పనికిరాని స్థితికి చేరుకుందని, దానిని మరమ్మతు చేయడం సాధ్యం కాదని తెలిపారు. అందువలన కొత్త ప్రయాణికుల సమాచార వ్యవస్థతో పాటు ఎలక్ట్రానిక్ కోచ్ గైడెన్స్, స్క్రోలింగ్ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ పనులను అమలు చేసే సంస్థకు బాధ్యతలు అప్పగించామని, పనులు త్వరలో ప్రారంభమై 2026 అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, వెంకటగిరి రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని వారికి సరైన సమయంలో ఖచ్చితమైన సమాచారం అందించే ఆధునిక డిస్‌ప్లే వ్యవస్థ ఎంతో అవసరమని అన్నారు. కొత్త డిస్‌ప్లే బోర్డులు అందుబాటులోకి రావడంతో రైళ్ల రాకపోకలు, ప్లాట్‌ఫారం వివరాలు, కోచ్‌ల స్థానాలు తదితర సమాచారం సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యమని, నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.