ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. మాతృ-శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా అర్హులైన కుటుంబాలు, దంపతులకు రూ.5,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల నుంచి ప్రతి జిల్లాలో మూడు జంటలను ఎంపిక చేసి ఒక్కో జంటకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తారు. అలాగే, ఒక బిడ్డ నుంచి మరో బిడ్డకు కనీసం రెండేళ్ల విరామం పాటించిన దంపతులకు కూడా రూ.5,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.
ప్రతి జిల్లాలో అర్హులైన కుటుంబాలు లేదా దంపతులను ఎంపిక చేస్తారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84 మంది జంటలకు ఈ ప్రోత్సాహకం అందించేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ కార్యక్రమం ప్రధానంగా మాతృ ఆరోగ్యం, శిశు సంక్షేమం, కుటుంబ సంక్షేమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమలు చేస్తున్నారు. దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక తేదీలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఆయా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలు త్వరలో వెల్లడించనున్నాయి.