sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:56 am Digital Edition : SATHYA VELUGU

“పాన్ కార్డ్ కొత్త నియమాలు: మీ ప్రతి లావాదేవీ ఇప్పుడు ప్రభుత్వ నజర్లో!”

Cash Deposit PAN Limit: భారతీయులకు పాన్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఆర్థిక అవసరాల్లో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించి కేంద్రం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. కొన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు పరిమితుల్ని సవరించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

PAN Card for Financial Transactions : భారతదేశంలో ఆధార్ కార్డుతో పాటుగా పాన్ కార్డు కూడా అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఇది ఎక్కువగా ఆర్థిక లావాదేవీల సమయంలో అవసరం పడుతుంది. ఇటీవల ఈ శాశ్వత గుర్తింపు సంఖ్యకు (PAN) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పుల్ని చేపట్టింది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్‌ను సవరించింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం- 2025 ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త పన్ను నిబంధనల్ని నోటిఫై చేసింది. ఇక్కడే పాన్ కార్డు లావాదేవీ పరిమితులు కూడా మారాయి. ఇవి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రాబోతున్నాయని స్పష్టం చేసింది. ఈ కొత్త లిమిట్స్ చూద్దాం.

>> ముందుగా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ అకౌంట్‌లో రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదును ఒకేసారి లేదా విడతల వారిగా డిపాజిట్ చేసినా.. విత్‌డ్రా చేసుకున్నా.. దీనికి పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకటే బ్యాంక్ లేదా వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలో జరిగినా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం మాత్రం రోజులో రూ. 50 వేలు దాటితేనే పాన్ అవసరం పడుతుంది.

  • ప్రాపర్టీ పర్చేజ్ అంటే ఇళ్లు లేదా ప్లాట్ల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి.. ట్రాన్సాక్షన్ వాల్యూ రూ. 20 లక్షలు దాటితే ఇక మీదట పాన్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం ఈ లిమిట్ రూ. 10 లక్షలుగా ఉంది.
  • టూ వీలర్స్ సహా ఏ మోటర్ వాహనం కొనుగోలు చేసినా దాని విలువ రూ. 5 లక్షలు దాటితే కొనుగోలుదారు.. పాన్ కార్డును కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. పాత చట్టంలో అసలు ద్విచక్ర వాహనాలకు ఈ రూల్ అమలు చేయలేదు. కార్లు, ఇతర వెహికిల్స్‌కు ధరతో సంబంధం లేకుండా పాన్ అడిగేవారు. ఇప్పుడు కొత్త లిమిట్ తీసుకొచ్చింది కేంద్రం.
  • వీటితో పాటుగా హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రెస్టారెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే పేమెంట్స్‌కు సంబంధించి కూడా ఇక మీదట రూ. 1 లక్ష దాటితే పాన్ కార్డు/వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ లిమిట్ రూ. 50 వేలుగానే ఉంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రెట్టింపు చేశారు.

ఇదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో కూడా పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ. 50 వేలు దాటితే పాన్ అడుగుతుండగా.. ఇక మీదట ప్రతి పాలసీకి కూడా పాన్ వివరాల్ని కచ్చితంగా సమర్పించాలి.