లోక్‌సభ, దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నియోజకవర్గాలు 263కు తెలంగాణలో 179కి చేరతాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.
ఈ మేరకు బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. దీని ప్రకారం లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుత 119అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం జరిగిన ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి కిరణ్ రిజిజు,న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోను విడిగా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనూ అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది.
2029 ఎన్నికల కోసం చకచకా పనులు
అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగానే మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి వచ్చే 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం.
మద్దతు కోసం కేంద్రం ప్రయత్నాలు
2023 సెప్టెంబరులో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సి ఉంది. భారత రాజ్యాంగంలోని అధికరణలు 170(3), 81(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందుకే కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తెస్తుందని ఇప్పటివరకూ భావించారు. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1కల్లా పూర్తి కానుంది. దీంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపటొచ్చు. ఈ అంశంపై అన్నిపార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది.
దక్షిణాది రాష్ట్రాల కోసమే 50శాతం
అయితే జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరగుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నాయకులు మంగళవారం సమావేశం కానున్నారు. అయితే సీట్ల పెంపు విషయంపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. కసర్తులు మొదలుపెట్టినట్లు మాత్రమే తెలుస్తోంది.