సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు.
భార్య వివాహేతర సంబంధంలో ఉందనే విషయాన్ని ప్రాథమిక ఆధారాలతో (Ex-facie evidence) భర్త ప్రాథమిక దశలోనే నిరూపించగలిగితే, ఆమెకు ఇచ్చే మధ్యంతర జీవనభృతిని (Interim Maintenance) నిరాకరించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సీఆర్‌పీసీ సెక్షన్ 125(4) ప్రకారం భర్త దాఖలు చేసిన పిటిషన్‌లో సమర్పించిన ఆధారాలు వ్యభిచార బంధాన్ని ప్రాథమికంగా రుజువు చేస్తున్నప్పుడు, ఆ అంశాన్ని చివరి విచారణ దశ వరకు వేచిచూడకుండా మధ్యంతర దశలోనే నిర్ణయించవచ్చని తేల్చిచెప్పింది.
న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.
రాజస్థాన్‌కు చెందిన హిమాంశు చోర్డియా అనే వ్యక్తికి 2014లో వివాహమైంది. మనస్పర్థల కారణంగా 2020లో భార్య తమ బిడ్డతో కలిసి అత్తవారింటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఆమె జీవనభృతి కోరుతూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr.P.C.) సెక్షన్ 125 కింద కోర్టును ఆశ్రయించింది.
దీనిపై భర్త స్పందిస్తూ, తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధంలో ఉందని, కాబట్టి సెక్షన్ 125(4) ప్రకారం ఆమెకు జీవనభృతి పొందే హక్కు లేదని పేర్కొంటూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాడు. తన వాదనకు మద్దతుగా కొన్ని ఛాయాచిత్రాలు, ఇతర ఆధారాలను న్యాయస్థానం ముందుంచాడు.
అయితే, ఈ ఆధారాల ప్రామాణికతను కేవలం ప్రధాన పిటిషన్ విచారణ ముగింపు దశలోనే తేల్చగలమని పేర్కొంటూ ట్రయల్ కోర్టు భర్త పిటిషన్‌ను ప్రారంభంలోనే కొట్టివేసింది. దీనిని హైకోర్టు కూడా సమర్థించింది. మధ్యంతర జీవనభృతిని నిర్ణయించే ముందు ఇలాంటి అంశాన్ని తేల్చాలని చట్టంలో ప్రత్యేక నిబంధన ఏదీ లేదని హైకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు ఉత్తర్వులపై భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం కింది కోర్టుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. భర్త తీసుకొచ్చిన ఆధారాలు భార్య వివాహేతర సంబంధాన్ని ప్రాథమికంగా స్పష్టం చేస్తున్నప్పుడు, ఆ పిటిషన్‌ను ప్రారంభంలోనే తిరస్కరించడం ఎంతమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. అంతిమ తీర్పు ఇచ్చే దశలోనే ఈ అంశాన్ని తేల్చాలని అనుకోవడం వల్ల చట్టంలో కల్పించిన సెక్షన్ 125(4) నిబంధన నిరుపయోగంగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది.
కింది కోర్టులు చేసిన పొరపాటును సరిదిద్దుతూ, భర్త వేసిన పిటిషన్‌ను చట్టపరమైన అర్హతల (Merits) ఆధారంగా పునఃపరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపింది.