ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో సంచలన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి లేదా సంస్థల నుంచి అక్రమంగా జీతాలు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్థిక శాఖ నిర్వహించిన డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ ప్రక్రియలో ఈ అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక విచారణలో దాదాపు 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఒకే సమయంలో రెండు శాఖల నుంచి రెండు జీతాలు డ్రా చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ తీవ్రమైన నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ప్రత్యేక విచారణకు ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలపై తక్షణమే విచారణ పూర్తి చేసి, పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ అనంతరం అక్రమంగా జీతాలు పొందిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.