sathyavelugu.com
Date of Publish : 30 September 2026, 6:10 pm Posted by : Dr.K.Suresh Editor

చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపు

సత్య వెలుగు న్యూస్ : చిత్తూరు

చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ, చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సెప్టెంబర్ 30న ఉదయం 10 గంటలకు అంబేద్కర్ సర్కిల్, చిత్తూరులో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. రమేష్ బాబు తెలిపారు.

AICC, APCC అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి AICC కార్యదర్శులు గణేష్ కుమార్ యాదవ్, పాలక్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పలు ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేతలు 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ఆరోపిస్తుండగా, ఈ ప్రక్రియపై ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టబద్ధంగానే జరిగాయని, కమిషన్ నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా అంశంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లతోనే చిత్తూరులో నిరసన చేపడుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలిపింది.

కార్యక్రమానికి నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, వివిధ విభాగాలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, సెల్‌ల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని డి. రమేష్ బాబు కోరారు.