sathyavelugu.com
Date of Publish : 03 September 2026, 9:26 pm Posted by : KUMPATI SURESH

అదనపు డైరెక్టర్‌ జగన్‌కు టీడబ్ల్యూజేఎఫ్‌ ఘన సన్మానం

సత్య వెలుగు – హైదరాబాద్ ప్రతినిధి

సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన డీఎస్‌ జగన్‌కు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లోని సమాచార్‌ భవన్‌లో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య ఆధ్వర్యంలో ఫెడరేషన్‌ ప్రతినిధులు జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్‌, తాటికొండ కృష్ణ, బి. రాజశేఖర్‌, కార్యదర్శి గండ్ర నవీన్‌ తదితరులు జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమం కోసం జగన్‌ దీర్ఘకాలంగా కృషి చేశారని ఫెడరేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయనకు పదోన్నతి లభించిన నేపథ్యంలో మరింత బాధ్యత పెరిగిందని, జర్నలిస్టులు–సమాచార శాఖ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

అదేవిధంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, జిల్లాల్లో అక్రిడిటేషన్ల విషయంలో డీపీఆర్‌వోలు జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య ‘రాజ్యాంగం మనకేమిచ్చింది’ అనే పుస్తకాన్ని డీఎస్‌ జగన్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొని జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.