కోట: మండలంలోని గూడలి గ్రామం స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో ఇళ్ల నుంచి వ్యర్థజలాలను రహదారి వైపు విడుదల చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు, బాత్రూం నీరు, బట్టలు ఉతికిన నీరు రోడ్డుపైకి చేరుతుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, సైకిల్, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వాహనాలు వెళ్లే సమయంలో మురుగునీరు చిమ్మడంతో పాదచారులు, వాహనదారుల దుస్తులు మురికవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రహదారి పక్కన నీరు నిలవడంతో దుర్వాసన, దోమల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ అధికారులు స్థలాన్ని పరిశీలించి, రహదారిపైకి వ్యర్థజలాలు రాకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.