పుంగనూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
పుంగనూరు పట్టణంలోని రాంనగర్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కరాటే, యోగా యూనిఫామ్స్ పంపిణీ చేశారు. తల్లిదండ్రులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన యూనిఫామ్స్‌ను మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ రెడ్డన్న శెట్టి మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక, మానసిక నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాలలో కరాటే, యోగా తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్ అందించిన తల్లిదండ్రులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానోపాధ్యాయురాలు కళావతి మాట్లాడుతూ ప్రతి బుధవారం, శనివారం పాఠశాలలో ప్రత్యేకంగా కరాటే, యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలతో పాటు ప్రతి వారం నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హేమలత, చిన్న రెడ్డప్ప, సతీష్ కుమార్, సీఆర్‌పీ నారాయణస్వామి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.