sathyavelugu.com
Date of Publish : 12 September 2026, 11:39 pm Posted by : KUMPATI SURESH

కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుదాం: కాకాణి

నెల్లూరు, సెప్టెంబర్‌ 12: రాబోయే స్థానిక సంస్థలు, నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఐక్యంగా పోరాడి విజయం సాధించాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

శ్రీ కన్వెన్షన్‌ హాల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నెల్లూరు నగర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాయకులకు గుర్తింపు కార్డులను అందజేశారు.

రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 72 సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని కోరారు.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాకాణి, డీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే భయపడేది లేదని, పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్సార్‌సీపీ విజయానికి నాంది కావాలని ఆకాంక్షించారు.