sathyavelugu.com
Date of Publish : 07 September 2026, 10:41 pm Posted by : KUMPATI SURESH

కొండూరులో ‘సామాజిక శంఖారావం’ డ్రైనేజీ, రహదారి సమస్యలు పరిష్కరించాలని KVPS డిమాండ్

తడ, సెప్టెంబర్ 7: తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు గ్రామంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) సూళ్లూరుపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ‘సామాజిక శంఖారావం’ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు గ్రామంలో పర్యటించిన కమిటీ సభ్యులు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రధానంగా డ్రైనేజీ, రహదారుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వీధులు గుంతలమయంగా మారి నీరు నిలిచిపోవడంతో ప్రజలు, పాఠశాల విద్యార్థులు, రోజువారీ కూలీలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొండూరు గ్రామంలోని డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, గుంతలమయమైన వీధులకు మరమ్మతులు చేపట్టి వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని KVPS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలు, విద్యార్థులు, కార్మికులకు సురక్షితమైన రహదారులు, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కార్యదర్శి డమాయి ప్రభాకర్, KVPS ఏరియా కమిటీ అధ్యక్షులు కె. చంద్రబాబు, APDKS రాష్ట్ర నాయకులు కె.వి. మునెయ్య, గౌరవ అధ్యక్షులు శామ్యూల్, ట్రెజరర్ ఆర్. వెంకటరమణ, సహాయ కార్యదర్శులు డమాయి వెంకయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. గ్రామస్తులు రత్నయ్య, భరణి, కె. చెంగయ్య, ఎం. కోటేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని KVPS నాయకులు తెలిపారు.