sathyavelugu.com
Date of Publish : 27 September 2026, 7:54 pm Posted by : Dr.K.Suresh Editor

ఆర్టీఐ పరిధి నుంచి శాంతిభద్రతల విభాగం మినహాయింపు

– గెజిట్ ఉత్తర్వులు జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం
– గూఢచార, భద్రతా సంస్థగా వర్గీకరణ
– పారదర్శకతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
– రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిర్ణయం

చెన్నై, సెప్టెంబర్ 27,సత్య వెలుగు న్యూస్: రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన శాంతిభద్రతల విభాగాన్ని సమాచార హక్కు చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గూఢచార, భద్రతా సంస్థల జాబితాలో ఈ విభాగాన్ని చేర్చుతూ ప్రభుత్వం గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ శాఖకు సంబంధించిన అనేక అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు పొందే అవకాశాలు పరిమితమవుతాయని భావిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మానవ వనరుల నిర్వహణ శాఖ ద్వారా విడుదల చేసిన ఉత్తర్వుల్లో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 24(4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను వినియోగించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నిబంధన ప్రకారం గూఢచార, భద్రతా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను సమాచార హక్కు చట్టం పరిధి నుంచి మినహాయించే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. అదే అధికారాన్ని ఉపయోగించి శాంతిభద్రతల విభాగాన్ని ప్రత్యేక జాబితాలో చేర్చినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు, రాజకీయ ఆందోళనలు, నిరసనలు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన అంశాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం తీసుకునే అనేక నిర్ణయాలు ఈ శాఖ ద్వారా అమలవుతుంటాయి. తాజా నిర్ణయంతో ఈ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని పొందడంలో పరిమితులు ఏర్పడే అవకాశముందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయంపై పౌరసంఘాలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజలకు సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమని, ఇలాంటి నిర్ణయాలు పారదర్శకతపై ప్రభావం చూపవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజా పర్యవేక్షణ తగ్గే ప్రమాదం ఉందని కూడా వారు పేర్కొంటున్నారు.
మరోవైపు భద్రతా వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రక్షించేందుకు ఇలాంటి చర్యలు అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కొన్ని వివరాలు బహిర్గతం కాకుండా ఉండటం అవసరమని వారు వాదిస్తున్నారు. భద్రతా అంశాలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని చెబుతున్నారు. అయితే సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలు ప్రత్యేక పరిస్థితుల్లో పరిశీలనకు అవకాశం ఉండే విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. మొత్తంగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పారదర్శకత, జవాబుదారీతనం, భద్రత అంశాలపై విస్తృత చర్చకు దారితీసింది.