sathyavelugu.com
Date of Publish : 28 September 2026, 3:20 pm Posted by : Dr.K.Suresh Editor

చౌడేపల్లిలో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

చౌడేపల్లి, సెప్టెంబర్ 28 (సత్యవెలుగు న్యూస్):
ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలోని వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 16 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న వీఆర్ఏలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు.

సమగ్ర న్యాయం, తమ సమస్యలకు పరిష్కారం లభించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా వీఆర్ఏలు ప్రభుత్వానికి పలు డిమాండ్లను వెల్లడించారు. వీఆర్ఏలకు వేతన స్కేల్‌ను తక్షణమే అమలు చేయాలని, వీఆర్ఏల స్థానంలో పనిచేస్తున్న నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా అర్హులైన వీఆర్ఏలకు తగిన ప్రమోషన్లు కల్పించాలని, కారుణ్య నియామకాల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధి సుమంత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజన్న, రెడ్డిప్ప, భాస్కర్, సావిత్రమ్మ, రెడ్డిరాజా, గంగులప్పతో పాటు పలువురు వీఆర్ఏలు, సంఘ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.