sathyavelugu.com
Date of Publish : 04 September 2026, 10:07 pm Posted by : KUMPATI SURESH

విద్యుత్ ఘాతానికి ప్రైవేట్ లైన్ మ్యాన్ మృతి

దొరవారిసత్రం: విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో, పాలెంపాడు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని దళితవాడలో విద్యుత్ స్తంభంపై సమస్యను సరిచేసేందుకు ఎక్కిన ప్రైవేట్ లైన్మెన్ దొడ్డి గుంటకయ్య (36) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

త్రీ ఫేజ్ స్తంభానికి దళితవాడతో పాటు బీసీ కాలనీ ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరా అవుతుండగా, ఒకవైపు మాత్రమే సరఫరా నిలిపివేసి స్తంభంపైకి ఎక్కడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన సమయంలో సంబంధిత శాఖ లైన్మెన్ అందుబాటులో లేకపోవడం, విద్యుత్ సరఫరాపై పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు.

గుంటకయ్య మృతితో భార్య, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ లైన్మెన్ల భద్రతపై విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.