sathyavelugu.com
Date of Publish : 18 September 2026, 10:27 pm Posted by : KUMPATI SURESH

అంబేద్కర్‌ పుస్తకంపై చౌడేపల్లిలో నిరసన హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్

చౌడేపల్లి, సెప్టెంబర్ 18, సత్య వెలుగు న్యూస్: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించేలా పుస్తకం రూపొందించారంటూ ఆరోపిస్తూ చౌడేపల్లి మండలంలోని దళిత సంఘాలు, కుల వివక్ష పోరాట సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హమారా ప్రసాద్ అలియాస్ నాగులరపు వర ప్రసాద్ రచించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకంలోని అంశాలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. పుస్తకంలోని అంశాలు అంబేద్కర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఇప్పటికే వర ప్రసాద్‌ను అరెస్టు చేసి, పుస్తకం ప్రతులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.

అంబేద్కర్‌ను కించపరిచే ప్రయత్నాలను నిరోధించేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు కోరారు. అనంతరం రెవెన్యూ అధికారి దొరస్వామికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు డాక్టర్ చంద్ర, కుల వివక్ష పోరాట సమితి నాయకుడు వాసు, అంబేద్కర్ భవన నిర్మాణకర్త బ్యాంకు రెడ్డప్ప, చిన్నస్వామి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.