sathyavelugu.com
Date of Publish : 21 September 2026, 9:44 pm Posted by : Dr.K.Suresh Editor

వేణుంభాకంలో పడకేసిన పారిశుధ్యం

దొరవారిసత్రం, సెప్టెంబర్ 21 | సత్య వెలుగు న్యూస్

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం వేణుంభాకం గ్రామంలోని దళితవాడ, గిరిజన కాలనీల్లో పారిశుధ్యం అధ్వానంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో చెత్తకుప్పలు, మురుగునీరు, బురద పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందని తెలిపారు. రాత్రివేళ దోమల బెడద ఎక్కువై సీజనల్ వ్యాధుల భయం నెలకొన్నట్లు పేర్కొన్నారు.

కనీసం బ్లీచింగ్ చల్లడం, వీధుల్లో క్లోరినేషన్ చేయడం, ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సచివాలయం సమీపంలోనూ చెత్త పేరుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టి, చెత్తను తొలగించి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.