sathyavelugu.com
Date of Publish : 28 September 2026, 3:30 pm Posted by : Dr.K.Suresh Editor

మండలంలో వరుసగా కేబుల్ దొంగతనాలు

చౌడేపల్లి, సెప్టెంబర్ 28 – సత్య వెలుగు న్యూస్:
చౌడేపల్లి మండలంలో బోరుబావుల కేబుల్ వైర్ల దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గడంవారిపల్లి పరిధిలో కేబుల్ దొంగతనానికి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మండలంలోని గడంవారిపల్లి పరిధిలోని బండోని చెరువు వద్ద రైతు నాటేష్‌కు చెందిన బోరుబావి కేబుల్ వైర్లు దొంగతనానికి గురయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బోరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తూ కేబుల్ వైర్లను కట్ చేస్తున్న వ్యక్తిని రైతులు, స్థానికులు గుర్తించారు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కేబుల్ వైర్లతో సహా నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో పట్టుబడిన వ్యక్తిని ఆమినిగుంటకు చెందిన చిరంజీవిగా గుర్తించినట్లు సమాచారం. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

మండలంలో బోరుబావుల కేబుల్ దొంగతనాలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.