sathyavelugu.com
Date of Publish : 04 September 2026, 10:56 am Posted by : KUMPATI SURESH

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

సత్య వెలుగు – హైదరాబాద్ ప్రతినిధి

హైదరాబాద్‌ పాతబస్తీని కేవలం ‘ఓల్డ్ సిటీ’గా కాకుండా తెలంగాణకు గర్వకారణమైన ‘ఒరిజినల్ సిటీ’గా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. చంచల్‌గూడ–సంతోష్‌నగర్ మధ్య రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన 3.2 కిలోమీటర్ల స్టీల్ ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ పాతబస్తీ ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మలక్‌పేటలో ఆడబిడ్డల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులు 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట మెట్రో మార్గాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేసి, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని సీఎం తెలిపారు. రహదారి విస్తరణకు అవసరమైన 900 ఆస్తుల్లో 850 వరకు సమస్య పరిష్కారమైందని, మిగిలిన వాటిని త్వరగా క్లియర్ చేసి డిసెంబర్ నాటికి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

పాతబస్తీ హైదరాబాద్‌ నగరానికి అసలైన ఆత్మ అని, చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మీర్‌ఆలం వద్ద రూ.500 కోట్లతో చేపడుతున్న కేబుల్‌స్టే వంతెన, ఇతర ఫ్లైఓవర్లు, వంతెనలు, డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ కేబులింగ్ పనులను కూడా వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

హిందూ, ముస్లింలు తెలంగాణకు రెండు కళ్ల వంటివారని పేర్కొన్న సీఎం.. పాతబస్తీ అభివృద్ధికి ప్రజలు, స్థానిక నాయకులతో కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.