చౌడేపల్లి, సెప్టెంబర్ 19: చౌడేపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
చౌడేపల్లి–పలమనేరు ప్రధాన రహదారిలోని చిట్టిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చౌడేపల్లి పట్టణంలోని కుమ్మరవీధికి చెందిన మహేష్ (26), చౌడేపల్లి మండలం గోసలకురపల్లికి చెందిన సంతోష్ (22) అక్కడికక్కడే మృతి చెందారు.
అదే ప్రమాదంలో చౌడేపల్లిలోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేంద్ర, గోసలకురపల్లికి చెందిన చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నరేంద్రకు కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో పాటు తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాఫిక్‌ను మళ్లించి, మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం కోసం చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు మహేష్ ఇండియన్ బ్యాంకులో స్కావెంజర్‌గా పనిచేస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండే మహేష్ మృతి చెందడంతో చౌడేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్‌కు ఆరు నెలల క్రితమే వివాహం కాగా, ప్రస్తుతం ఆయన భార్య నాలుగు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు.
మరో మృతుడు సంతోష్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుటుంబాల్లోనూ సంపాదించే వ్యక్తులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.