నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు.
మంగళవారం నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, రూ.1.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పశువుల పాక (క్యాటిల్ షెడ్) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గతంలో పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో సుమారు 33 సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రైతాంగ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కురుగొండ పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ ధారా అంకయ్య, టీడీపీ నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి, కాపులూరు చక్రపాణి, బల్లి ముత్యాలయ్య, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.