sathyavelugu.com
Date of Publish : 21 October 2026, 4:28 pm Posted by : Dr. S.sudhakar

తిరుపతి జిల్లాలో ఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు

నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల నిఘా.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు

తిరుపతి, అక్టోబర్ 20 (సత్య వెలుగు న్యూస్):

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీసు నిఘా ఏర్పాటు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

నామినేషన్ కేంద్రాల సమీపంలోని ఇళ్ల యజమానులు, దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికల సమయంలో రాజకీయ విభేదాల కారణంగా గొడవలు, ఘర్షణలకు పాల్పడరాదని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.