పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్ : నెలబల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది మంది రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో మోటార్లు చోరీకి గురికావడంతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రావులపాడు, భీమవరం ప్రాంతాల్లోనూ వరుస చోరీలు!
ఇటీవల రావులపాడు, భీమవరం తదితర ప్రాంతాల్లో సైతం పదుల సంఖ్యలో వ్యవసాయ విద్యుత్ స్టార్టర్లు చోరీకి గురైనట్లు రైతులు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో పొలాల వద్ద వ్యవసాయ పరికరాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చోరీకి గురైన రైతుల వివరాలు
నెలబల్లి గ్రామానికి చెందిన జె. రమేష్ రెడ్డి, పి. సుధాకర్ రెడ్డి, జి. నరేష్ రెడ్డి, టి. శ్రీధర్ రెడ్డి, డి. శివయ్య, వెంకటయ్య, కాంతారావు, సుందరయ్య, ఏ. కృష్ణారెడ్డిలకు చెందిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు సమాచారం.
దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలి!
ఇప్పటికే పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మోటార్లు, స్టార్టర్ల చోరీలు మరింత భారంగా మారుతున్నాయి. ఈ ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ పరికరాల రక్షణకు తగిన చర్యలు చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.