sathyavelugu.com
Date of Publish : 26 October 2026, 4:28 pm Posted by : Dr. S.sudhakar

25 ఏళ్లుగా ఎదురుచూపులే.. నందిమంగళం విద్యార్థులకు ప్లే గ్రౌండ్ ఎక్కడ?

-పుత్తూరు 15వ వార్డులో ఆటస్థలం కరువు – అధికారులకు గ్రామ ప్రజలు, యువత విజ్ఞప్తి!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 26:తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఉన్న ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఆటస్థలం లేకపోవడం పట్ల గ్రామ ప్రజలు, యువత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 నుంచి 25 సంవత్సరాలుగా నందిమంగళం గ్రామ ప్రజలు, యువత ఈ సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు ప్లే గ్రౌండ్ స్థలాన్ని కేటాయించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం (ఎమ్మార్వో), కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో పలుమార్లు అర్జీలు సమర్పించినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఆటలు ఎంతో అవసరం. అయితే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు స్వేచ్ఛగా ఆడుకోవడానికి తగిన ఆటస్థలం లేకపోవడంతో వారి క్రీడా ప్రతిభను అభివృద్ధి చేసుకునే అవకాశం దూరమవుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

కూటమి ప్రభుత్వం స్పందించాలి!

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నందిమంగళం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు అనువైన స్థలాన్ని గుర్తించి, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, యువత కూటమి ప్రభుత్వాన్ని, సంబంధిత జిల్లా అధికారులను కోరుతున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామీణ విద్యార్థులకు క్రీడా సదుపాయాలు కల్పించి, వారి ప్రతిభకు ప్రోత్సాహం అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.