sathyavelugu.com
Date of Publish : 05 October 2026, 9:28 pm Posted by : Dr.K.Suresh Editor

పందిలపల్లిలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం , గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంపై అవగాహన

చౌడేపల్లి, అక్టోబర్ 5,సత్య వెలుగు న్యూస్:
చౌడేపల్లి మండలం పందిరిపల్లి పంచాయతీ పరిధిలోని పందిలపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల్లో పోషకాహార లోపాలను నివారించడంతో పాటు, పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చిన్నారులకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని తల్లిదండ్రులకు సూచించారు.

గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు అవసరమైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై వివరించారు. సమతుల్యమైన, పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, పిల్లల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార పదార్థాలు, అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు.

అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను అభినందిస్తూ వారిని ఘనంగా సన్మానించారు. అలాగే గర్భిణులకు సీమంత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధమ్మ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంపై ప్రతి కుటుంబం ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.