sathyavelugu.com
Date of Publish : 26 October 2026, 7:54 pm Posted by : Dr.K.Suresh Editor

“మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి”

-నాయుడుపేట 13వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మేడిద రత్నశ్రీ ఇంటింటి ప్రచారం

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ 13వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి మేడిద రత్నశ్రీ సోమవారం వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, పెద్దలను కలుసుకుంటూ తనను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఆశీర్వదించాలని కోరారు.

ప్రచార సమయంలో పలుచోట్ల మహిళలు హారతులు పట్టి ఆమెకు మద్దతు తెలిపారు. యువతులు, వృద్ధులు ఆమెను ఆశీర్వదించడంతో ప్రచారం కొనసాగింది.

వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఈ సందర్భంగా మేడిద రత్నశ్రీ మాట్లాడుతూ.. “నేను ఈ వార్డు ఆడబిడ్డను. మీలో ఒకదాన్ని. మన వార్డులోని సమస్యలు నాకు తెలుసు. మహిళగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోగలను. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను” అని పేర్కొన్నారు.

13వ వార్డులో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, రహదారుల ఇబ్బందులు, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని, వార్డును పరిశుభ్రంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

మహిళా సంక్షేమ పథకాలపై ప్రచారం

జగన్‌ హయాంలో అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, విద్యాదీవెన వంటి పథకాల ద్వారా మహిళలు, విద్యార్థులకు ప్రయోజనాలు అందాయని ఆమె ప్రచారంలో వివరించారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

“ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి నన్ను, మన చైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మను గెలిపించండి” అని మేడిద రత్నశ్రీ ప్రజలను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.