పుత్తూరు , సత్య వెలుగు న్యూస్: పుత్తూరు పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆర్. వెంకటేష్ అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దాసరి జనార్ధన్ మాట్లాడుతూ, రానున్న పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పార్టీ మూడు వార్డుల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రజా సమస్యలే పార్టీ అజెండా
మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే తమ పార్టీ ప్రధాన అజెండా అని దాసరి జనార్ధన్ పేర్కొన్నారు. సామాన్య ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే తమ పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని, అయితే ప్రజా సమస్యలపై తగిన శ్రద్ధ చూపడం లేదని దాసరి జనార్ధన్ విమర్శించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కంటే సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ గతంలో చేపట్టిన ఆందోళనలు, పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పట్టణ సమస్యల పరిష్కారమే లక్ష్యం
పుత్తూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అలంకారప్రాయంగా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వినియోగం, తాగునీటి సమస్య పరిష్కారం వంటి అంశాలపై ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.