నాయుడుపేట, అక్టోబర్ 4 (ఆదివారం) — సత్య వెలుగు న్యూస్:
నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం సమీపంలో చేపల విక్రయాలు నిర్వహించడంపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహనీయుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాన కూడళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా, గౌరవప్రదంగా ఉంచాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
పాత బస్టాండ్ ఆవరణలో సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మార్పీఎస్, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎంఈఎఫ్) నాయకులు పునాది పనులు చేపట్టినట్లు సమాచారం.
అయితే, అదే ప్రాంతంలో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపల విక్రయాలు జరుగుతున్నాయని, వ్యాపారుల నుంచి మున్సిపల్ అధికారులు ఫీజులు వసూలు చేసి అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహనీయుల విగ్రహాల సమీపంలో చేపల మార్కెట్ నిర్వహించడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ పట్టణంలో పర్యటించే మున్సిపల్ కమిషనర్‌కు ఈ పరిస్థితి కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు పట్టణ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. విగ్రహాలు, వాటి పరిసరాలను గౌరవప్రదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మహనీయుల విగ్రహాల ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ చేపల విక్రయాల నిర్వహణపై తగిన నిర్ణయం తీసుకోవాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ స్థాపన ప్రాంతాన్ని గౌరవప్రదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ నాయకులు కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.