sathyavelugu.com
Date of Publish : 14 October 2026, 9:01 pm Posted by : Dr.K.Suresh Editor

పుదిపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మహా చండి అలంకారంలో అమ్మవారి దర్శనం

-నాలుగో రోజు నవరాత్రి వేడుకలు..

-ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామ పారాయణంతో ఆధ్యాత్మిక శోభ

చౌడేపల్లి, అక్టోబర్ 14 | సత్య వెలుగు న్యూస్:పుదిపట్ల గ్రామంలో వెలసిన ప్రముఖ స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం అమ్మవారు మహా చండి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం

ఉదయాన్నే ఆలయ అర్చకురాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి, అమ్మవారిని మహా చండి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ఈ సందర్భంగా చౌడేపల్లి, పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు.

లలితా సహస్రనామ పారాయణంతో ఆధ్యాత్మిక శోభ

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం, మహిషాసురమర్దిని పారాయణం నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

ఉభయదారులుగా గుణవతి, కుమార్ రాజు

ఈ రోజు పూజా కార్యక్రమాలకు లద్ధిగం గ్రామానికి చెందిన గుణవతి, పుంగనూరుకు చెందిన కుమార్ రాజు ఉభయదారులుగా వ్యవహరించారు. పూజలు ముగిసిన అనంతరం ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

విద్యుద్దీపాల అలంకరణతో ఆలయానికి ప్రత్యేక శోభ

దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో, ప్రత్యేక పుష్పాలంకరణలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రానున్న నవరాత్రి రోజుల్లోనూ అమ్మవారి ప్రత్యేక అలంకారాలు, పూజా కార్యక్రమాలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.