వాకాడు, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్: వాకాడు మండలం కొండాపురం మోడల్ ప్రైమరీ స్కూల్ జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డును సొంతం చేసుకుంది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, మెరుగైన ఫలితాల సాధనకు చూపిన ప్రత్యేక శ్రద్ధకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
ఈ విజయానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ. వెంకటేశ్వర్లు అందించిన సేవలు ప్రధాన కారణమని స్థానికులు, విద్యాభిమానులు పేర్కొన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.
ఇప్పటికే ఈ. వెంకటేశ్వర్లు రెండుసార్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన నాయకత్వంలో కోండాపురం మోడల్ ప్రైమరీ స్కూల్ జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొందడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవార్డు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషికి గుర్తింపుగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుందని విద్యాభిమానులు పేర్కొన్నారు.