sathyavelugu.com
Date of Publish : 31 October 2026, 11:52 pm Posted by : Dr.K.Suresh Editor

*ఓటుకు వెల కట్టకు.. ఐదేళ్ల భవితను తాకట్టు పెట్టకు!*

_నోటుకు లొంగితే.. భవితకు ముప్పే!

_ఓటుకు వెల కడితే.. ప్రజాస్వామ్యానికి మచ్చే!

_బిర్యానీ పొట్లాలకు ఆశపడకు.. మద్యం సీసాలకు మైమరచిపోకు.. క్షణిక ప్రలోభాలకు తలవంచకు.. నీ ఓటుతో భావితరాల భవిష్యత్తుకు బాటలు వేయి !                    సత్య వెలుగు న్యూస్: జర్నలిస్ట్ గోను నవీన్ కుమార్

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం వేలిపై పడే సిరా గుర్తు కాదు.. అది ఒక పౌరుడి ఆత్మగౌరవానికి ప్రతీక.. సమాజ భవిష్యత్తును నిర్ణయించే శక్తి.. పాలకులను ఎన్నుకునే అధికారం. కులం లేదు.. మతం లేదు.. ధనిక, పేద అనే తారతమ్యం లేదు.. ఓటు హక్కు ముందు ప్రతి పౌరుడూ సమానమే. ఎన్నో భిన్నత్వాల మధ్య సమానత్వాన్ని చాటిచెప్పే గొప్ప ప్రజాస్వామ్య ఆయుధం ఒక్క ఓటు మాత్రమే.

కానీ ఎన్నికలు వచ్చాయంటే చాలు.. కొన్ని చోట్ల ఓటు విలువను నోట్ల కట్టల్లో, బిర్యానీ పొట్లాల్లో, మద్యం సీసాల్లో కొలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షణికమైన ప్రలోభాలకు ఆకర్షితులై ఐదేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి.. ఐదేళ్ల పదవీకాలం అంటే 1,825 రోజులు. మీ ఓటుకు ఇచ్చే రూ.1,500ను ఆ రోజులకు పంచితే రోజుకు వచ్చేది కేవలం 82 పైసలు మాత్రమే! మీ ఐదేళ్ల భవిష్యత్తు విలువ అంతేనా? బజారులో భిక్షాటన చేసేవారికి సైతం రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో.. మీ ఓటుకు మీరు కేవలం 82 పైసల విలువ కడతారా?

మీ ఐదేళ్ల భవిష్యత్తు విలువ అంతేనా? మీ కుటుంబ అవసరాలు, మీ ప్రాంత అభివృద్ధి, మీ పిల్లల భవిష్యత్తును కొన్ని నోట్లతో కొలవగలమా?

_నోటు నేడు చేతిలో ఉంటుంది.. కానీ ఓటు నిర్ణయం ఐదేళ్లు వెంటాడుతుంది!_

ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బు, బిర్యానీ, మద్యం కొద్దిసేపు ఆనందాన్ని ఇవ్వవచ్చు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత తాగునీటి సమస్యలు, రహదారుల దుస్థితి, పారిశుద్ధ్య సమస్యలు, ఉపాధి ఇబ్బందులు అలాగే ఉంటే బాధపడాల్సింది ప్రజలే. ఒక్క బిర్యానీ పొట్లం గ్రామానికి రహదారి వేయగలదా? ఒక్క మద్యం సీసా నిరుద్యోగికి ఉపాధి కల్పించగలదా? కొన్ని నోట్లు ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలవా? క్షణిక ఆనందం కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరించకూడదు.

_కులం కాదు.. గుణం చూడాలి! మతం కాదు.. మనసు చూడాలి!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కును కల్పించింది. ఒక వ్యక్తికి ఒక ఓటు.. ప్రతి ఓటుకు సమాన విలువ అనే సూత్రం ప్రజాస్వామ్య పునాది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలుగన్న బాధ్యతాయుతమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మన హక్కులను బాధ్యతతో వినియోగించుకోవాలి.

ఓటు వేసే ముందు అభ్యర్థి కులం, మతం, ఆర్థిక స్థితిని కాకుండా వ్యక్తిత్వాన్ని, నిజాయితీని, ప్రజాసేవ పట్ల నిబద్ధతను పరిశీలించాలి. ప్రజల సమస్యలపై అవగాహన, గతంలో చేసిన సేవలు, అభివృద్ధిపై స్పష్టమైన ఆలోచన, ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. హామీలకే పరిమితం కాకుండా వాటిని అమలు చేసే కార్యాచరణను కూడా గమనించాలి.

_ఓటు అమ్ముకుంటే.. ప్రశ్నించే హక్కును బలహీనపరుచుకున్నట్లే!_

ప్రజాస్వామ్యంలో ఓటరు కేవలం నాయకుడిని ఎన్నుకునేవాడు మాత్రమే కాదు.. పాలనను ప్రశ్నించేవాడు, అభివృద్ధిని కోరేవాడు, సమాజ మార్పులో భాగస్వామి కూడా. అందుకే ఓటు వేసే సమయంలో తీసుకునే ఒక్క నిర్ణయం ఐదేళ్ల పాలనకు దిశానిర్దేశం చేస్తుంది. ఎవరి ఒత్తిడికీ, ప్రలోభానికీ లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి ఓటరు బాధ్యత.

డబ్బుకు తలవంచకు.. బిర్యానీకి ఆశపడకు.. మద్యం మత్తులో మైమరచిపోకు. నీ ఓటు నీ హక్కు.. నీ ఓటు నీ గౌరవం.. నీ ఓటు నీ భవిష్యత్తు. కొన్ని నోట్ల కోసం నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, నీ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకో.

_చివరగా ఒక్క మాట..

ఈరోజు నీవు వేసే ఓటు రేపటి సమాజానికి దిశ చూపాలి. నీ పిల్లలకు ఆస్తిపాస్తులతో పాటు విలువలతో కూడిన సమాజాన్ని, సమానత్వంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని వారసత్వంగా అందించాలి. కులమతాలకు అతీతంగా, స్వార్థ ప్రయోజనాలకు దూరంగా, ప్రజాహితమే పరమావధిగా నిలిచే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి.

 

ఓటుకు వెల లేదు.. నీ ఆత్మగౌరవానికి హద్దు లేదు.. నీ ఒక్క ఓటుతోనే రేపటి తరానికి కొత్త బాట వేయగలవు!

ప్రలోభాలను తిరస్కరిద్దాం.. ఓటు హక్కును గౌరవిద్దాం.. ప్రజాస్వామ్య విలువలను కాపాడుదాం.. భావితరాలకు విలువైన సమాజాన్ని వారసత్వంగా అందిద్దాం!