sathyavelugu.com
Date of Publish : 08 October 2026, 7:14 pm Posted by : Dr.K.Suresh Editor

చింతపూడిలో ఉపాధి పనుల పరిశీలన

-రూ.5 లక్షలతో నీటి నిల్వ గుంట, రూ.1.80 లక్షలతో పశువుల పాక నిర్మాణం

-పల్లె పండుగ–3.0తో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

 పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:మండల పరిధిలోని చింతపూడి గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో సి. వేణయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో చేపడుతున్న నీటి నిల్వ గుంట (పర్కొలేషన్ పాండ్) పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రూ.5 లక్షల వ్యయంతో చేపడుతున్న నీటి నిల్వ గుంట పనులను పరిశీలించిన ఎంపీడీవో.. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పనుల పట్ల కూలీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎంపీడీవో వేణయ్య పేర్కొన్నారు. పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

చింతపూడి గ్రామంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను కూడా ఎంపీడీవో పరిశీలించారు. అలాగే రూ.1.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న క్యాటిల్ షెడ్ (పశువుల పాక) నిర్మాణ పనులను ప్రారంభించాలని రైతు చంద్రశేఖర్కు సూచించారు.

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రశేఖర్ రాజు, టీఏ సోము, మేట్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.