sathyavelugu.com
Date of Publish : 07 October 2026, 9:51 pm Posted by : Dr.K.Suresh Editor

ఏట్రియా ఫౌండేషన్ చైర్మన్ మన ప్రాంత వాసి కావడం ఓ వరం

-స్వర్ణ గ్రామ సచివాలయానికి రూ.1 లక్ష విలువైన కంప్యూటర్ వితరణ

-240 మంది విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

పాలసముద్రం, అక్టోబర్ 7 ,సత్య వెలుగు న్యూస్ :
ఏట్రియా ఫౌండేషన్ చైర్మన్ సుందర రాజు పాలసముద్రం ప్రాంత వాసి కావడం మన ప్రాంతానికి ఒక వరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సుధాకర్ రావు పేర్కొన్నారు.

బుధవారం మండలంలోని తిరుమల రాజపురం గ్రామంలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏట్రియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రజాసేవ, ప్రకృతి వ్యవసాయం, విద్యా రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి చైర్మన్ సుందర రాజును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా భీమినేని చిట్టిబాబు నాయుడు మాట్లాడుతూ, బెంగళూరు ప్రాంతంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన సుందర రాజు తాను పుట్టిన గడ్డను, స్థానిక ప్రజలను, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో భాగంగా స్వర్ణ గ్రామ సచివాలయ కార్యాలయానికి సుమారు రూ.1 లక్ష విలువైన కంప్యూటర్‌ను ఫౌండేషన్ తరఫున అందజేశారు. అదేవిధంగా 240 మంది విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏట్రియా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను పలువురు అభినందించారు. రాబోయే తరానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే పంటలు ఎంతో మేలు చేస్తాయని, ఆరోగ్యకరమైన జీవనానికి అవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

విద్యతో ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు.

ఏట్రియా ఫౌండేషన్ చైర్మన్ సుందర రాజు అందిస్తున్న సేవలు అభినందనీయమని, విద్య, ప్రకృతి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పలువురు కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.