sathyavelugu.com
Date of Publish : 20 October 2026, 6:32 pm Posted by : Dr.K.Suresh Editor

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

-నామినేషన్ల తిరస్కరణపై కోర్టును ఆశ్రయిస్తాం..

-తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలకు పోరాడతాం

నెల్లూరు, అక్టోబర్ 20,సత్య వెలుగు న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ, అధికారుల వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నామినేషన్లను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించారని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యల కోసం పోరాడతామని స్పష్టం చేశారు.

మంగళవారం నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని విమర్శించారు.

నామినేషన్ల తిరస్కరణపై తీవ్ర అభ్యంతరం

నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత పరిశీలన పేరుతో అభ్యర్థుల పత్రాలను వివిధ కారణాలతో తిరస్కరిస్తున్నారని కాకాణి ఆరోపించారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులను పొంతనలేని ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో ఒకే రిటర్నింగ్ అధికారి వేర్వేరు కారణాలు చూపుతూ నామినేషన్లను తిరస్కరించారని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల్లో నేరుగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు, బైండోవర్ చర్యల ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారని విమర్శించారు.

పలు డివిజన్లలో న్యాయపోరాటం

నెల్లూరు నగరంలోని 72, 68, 63, 10 డివిజన్లతో పాటు నెల్లూరు రూరల్ పరిధిలోని 36, 38, 39, 40, 41, 44 డివిజన్లలో నామినేషన్ల తిరస్కరణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాకాణి వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రిటర్నింగ్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని, అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తామని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అధికారుల వివరాలను సేకరించి న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాకాణి కోరారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం అధికార యంత్రాంగం బాధ్యత అని పేర్కొన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని కాకుండా ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి గెలవాలని కూటమి నాయకులకు సవాల్ విసిరారు.

బలమైన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు నామినేషన్ల తిరస్కరణలు, బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, ఇతర పక్షాల స్పందన తెలియాల్సి ఉంది.