sathyavelugu.com
Date of Publish : 22 October 2026, 9:10 am Posted by : Dr.K.Suresh Editor

ఎంపీటీసీ నామినేషన్‌కు అడ్డంకులు!

పెళ్లకూరు మేజర్ న్యూస్ | సత్య వెలుగు న్యూస్ :పెళ్లకూరు మండలంలోని పునబాక ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ సర్పంచ్ తుపాకుల చిత్రను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.

నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో కొందరు టీడీపీ నాయకులు రోడ్డుకు అడ్డంగా నిలిచి ఆమెను అడ్డుకున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు నామినేషన్ పత్రాలను చించివేశారని వారు ఆరోపించారు. ఈ ఘటన కారణంగా తుపాకుల చిత్ర ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయలేకపోయారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.