sathyavelugu.com
Date of Publish : 15 October 2026, 9:16 pm Posted by : Dr.K.Suresh Editor

చౌడేపల్లి బస్టాండ్ వద్ద ఆక్రమణలు తొలగించండి మహాప్రభూ!

-సర్వేలకే పరిమితమైన రోడ్డు విస్తరణ..

-ట్రాఫిక్ కష్టాలతో వాహనదారుల అవస్థలు

చౌడేపల్లి, అక్టోబర్ 15 ,సత్య వెలుగు న్యూస్:చౌడేపల్లి బస్టాండ్ పరిసరాల్లో రోడ్డు ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు. నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ రోడ్డు విస్తరణ పనులు సర్వేలు, మార్కింగ్‌లకే పరిమితమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చౌడేపల్లి–తిరుపతి ప్రధాన రహదారిలో బస్టాండ్‌కు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డు ఆక్రమణలకు గురై ఇరుకుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దుకాణాల ముందు సామగ్రిని రోడ్డుపైకి విస్తరించడం, తోపుడు బండ్ల వ్యాపారాలు, అక్రమ పార్కింగ్ కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు.

ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు

ఈ మార్గంలో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలు స్తంభిస్తున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు. బస్టాండ్ నుంచి ఒక వాహనం వెళ్లే సమయంలో ఎదురుగా మరో వాహనం వస్తే ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని అంటున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు బస్టాండ్ నుంచి దిగువ బజారు వరకు వాహనాలు బారులు తీరుతున్నాయని చెబుతున్నారు.

దీంతో కొందరు వాహనదారులు ప్రత్యామ్నాయంగా మేదరదొడ్డి, బజారువీధుల మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి వాహనదారుల సమయాన్ని వృథా చేయడమే కాకుండా, ప్రజల రాకపోకలకు కూడా ఇబ్బందులు కలిగిస్తోంది.

అత్యవసర వాహనాలకూ తప్పని ఇబ్బందులు!

ట్రాఫిక్ రద్దీ కారణంగా 108 అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర సేవలకు కూడా ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో వాహనాలు సకాలంలో వెళ్లలేకపోతే ప్రజలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ఆక్రమణల సమస్యను అధికారులు అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని కోరుతున్నారు.

మార్కింగ్‌లు వేశారు.. పనులు ఎప్పుడు చేపడతారు?

రోడ్డు విస్తరణ చేపడతామని ఆర్‌అండ్‌బీ అధికారులు పలుమార్లు మార్కింగ్‌లు వేసినప్పటికీ, పనులు ప్రారంభం కాలేదన్న విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి, రోడ్డు విస్తరణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.

అధికారుల దృష్టికి ప్రజల విజ్ఞప్తి

చౌడేపల్లి బస్టాండ్ నుంచి బజారువీధి మలుపు వరకు రోడ్డుపై ఉన్న ఆక్రమణలను గుర్తించి, నిబంధనల ప్రకారం తొలగించాలని వాహనదారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైన చోట రోడ్డు విస్తరణ చేపట్టి, పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు తోపుడు బండ్ల వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని సూచిస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, చౌడేపల్లి బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక రోడ్డు విస్తరణ సర్వేలు, మార్కింగ్‌లకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాలి.