అమరావతి, అక్టోబర్ 2 (సత్య వెలుగు న్యూస్):
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో కీలక అడ్డంకి తొలగినట్లు తెలుస్తోంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
వార్డులు, డివిజన్ల పునర్విభజన విషయంలో పరిపాలనా ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్లు అధికారులు భావిస్తున్నారు.
3,206 నుంచి 3,942కు పెరిగిన వార్డులు, డివిజన్లు
పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల్లో వార్డులు, డివిజన్ల సంఖ్య 3,206 నుంచి 3,942కు పెరిగినట్లు సమాచారం. దీంతో గతంలో ఉన్న పరిపాలనా, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.
పలు మున్సిపాలిటీలకు మార్గం సుగమం
ఈ పరిణామంతో రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి, శ్రీకాకుళం కార్పొరేషన్లతో పాటు రాజాం, గుడివాడ, భీమవరం, కావలి, శ్రీకాళహస్తి తదితర మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.
తాజా న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ తదితర అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.