-క్రీడాకారుడిని అభినందించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
సత్య వెలుగు న్యూస్ | తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన అర్చరీ క్రీడాకారుడు తిరుమూరు గణేష్ మణిరత్నం ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయనను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అభినందించారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎన్నికల అబ్జర్వర్ ఎం. వరప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు సమక్షంలో కలెక్టర్ గణేష్ మణిరత్నంను అభినందించి, ఆయన విజయాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్చరీ వంటి క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం క్రీడాకారుడి ప్రతిభ, పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనకు నిదర్శనమని అన్నారు. గణేష్ మణిరత్నం సాధించిన స్వర్ణ, కాంస్య పతకాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
క్రీడల్లో ఉన్నత విజయాలు సాధించాలంటే నిరంతర సాధనతో పాటు ఆత్మవిశ్వాసం, లక్ష్యంపై స్పష్టత, పట్టుదల ఎంతో అవసరమని తెలిపారు. గణేష్ మణిరత్నం ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తన ప్రతిభతో దేశానికి, తిరుపతి జిల్లాకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అభినందించారు.
ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించవచ్చని కలెక్టర్ అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రోత్సాహం, అవసరమైన సహాయ సహకారాలు కీలకమని పేర్కొన్నారు. గణేష్ మణిరత్నం క్రీడారంగంలో మరింత రాణించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.