sathyavelugu.com
Date of Publish : 14 October 2026, 10:22 pm Posted by : Dr.K.Suresh Editor

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత సమస్యపై విజయ్ కుమార్ ఐఏఎస్‌కు వినతి

-న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం: విజయ్ కుమార్ హామీ

నెల్లూరు, అక్టోబర్ 14: కోటలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత సమస్యను పరిష్కరించాలని కోరుతూ సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్‌ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

నెల్లూరులోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత సమస్యపై నాయకులు ఆయనతో చర్చించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యపై స్పందించిన విజయ్ కుమార్, త్వరలో కార్యాచరణ రూపొందించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సమితి అధ్యక్షులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు, తిరుమూరు కృష్ణయ్య, పంట్రంగం వసంత్, ఎన్. బాబు, బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివప్రసాద్, లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే, గౌరవ సలహాదారు కనుపూరు కృష్ణయ్య, కో-కన్వీనర్ తూపిలి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులు స్పందించి, విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు.