sathyavelugu.com
Date of Publish : 28 October 2026, 2:53 pm Posted by : Dr.K.Suresh Editor

కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడండి: మాజీ చైర్‌పర్సన్ మైలారి శోభారాణి

సత్య వెలుగు  న్యూస్,నాయుడుపేట: నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మాజీ చైర్‌పర్సన్ మైలారి శోభారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నాయుడుపేట మున్సిపాలిటీలోని 22వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి పాలెం వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె ఎల్.ఏ. సాగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాలెం వెంకటేశ్వర్లుతో పాటు చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ షకీరాకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రజలు పొందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మైలారి శోభారాణి మాట్లాడుతూ, 2015 నుంచి 2021 మధ్య తాను చైర్‌పర్సన్‌గా పనిచేసిన సమయంలో నాయుడుపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంతో పాటు నాయుడుపేట పట్టణం కూడా అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను మరచిపోకూడదని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని పేర్కొంటూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసే కూటమి అభ్యర్థులు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయుడుపేటలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆమె కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముసలి రాజమ్మ, మైలారి వెంకట్రావు, కటకం క్రిస్టియన్, పాగాలి శివకుమార్, నక్క వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.