sathyavelugu.com
Date of Publish : 04 October 2026, 7:18 pm Posted by : Dr.K.Suresh Editor

జీవీఎంసీ ఓటర్ల జాబితాపై వైసీపీ అభ్యంతరాలు

– అదనపు కమిషనర్‌కు వినతిపత్రం
– వార్డుల రిజర్వేషన్లపై సమగ్ర పరిశీలన కోరిన నేతలు
విశాఖపట్నం, అక్టోబర్ 4 , సత్య వెలుగు న్యూస్

 జీవీఎంసీ పరిధిలోని ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులతో కలిసి జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, రిజర్వేషన్ల అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. జీవీఎంసీ పరిధిలోని నూట ఇరవై వార్డుల ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పలువురు అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. ఓటర్ల వివరాల్లో తలెత్తిన వ్యత్యాసాలు, కులాల వారీగా నమోదు చేసిన గణాంకాలు, వార్డుల రిజర్వేషన్ల నిర్ణయంలో పరిగణనలోకి తీసుకున్న అంశాలపై వివరణ ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైందని, అందులో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని నాయకులు అభిప్రాయపడ్డారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వార్డుల రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల హక్కులను పరిరక్షించేందుకు తమ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన సూచనలు అధికారులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, శాసన మండలి సభ్యుడు కుంభ రవిబాబు, మాజీ శాసన సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్లు కటామురి సతీష్, జియ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, పళ్ళ దుర్గ, పి.వి. నారాయణ్, జి.వి. రవి రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల అంశాలపై పార్టీ తరఫున తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు.