sathyavelugu.com
Date of Publish : 11 November 2026, 10:22 pm Posted by : Dr. S.sudhakar

కార్వేటినగరం హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్!

-మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,నవంబర్ 10: కారు విషయంలో మధ్యవర్తిత్వం చేసినందుకు కక్ష పెంచుకుని యుగంధర్ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగా కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దారుణ హత్య.

కార్వేటినగరం: చిత్తూరు జిల్లా కార్వేటినగరం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యుగంధర్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని కలిపి మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండటంతో అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కార్వేటినగరం మండలం తురకమిట్ట గ్రామానికి చెందిన పి. యుగంధర్ ఓ కారు విషయంలో మధ్యవర్తిత్వం చేయడంతో కె.ఎం. పురం గ్రామానికి చెందిన కొందరితో వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నవంబర్ 7న యుగంధర్‌ను నిందితులు దుర్భాషలాడి, దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం నవంబర్ 9న యుగంధర్ తన స్నేహితులైన ప్రభుదాస్, అశోక్ కుమార్‌లతో కలిసి కె.ఎం. పురం గ్రామానికి వెళ్లి లీలా కుమార్, గిరితో మాట్లాడుతుండగా మరోసారి గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనపై యుగంధర్ కార్వేటినగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

తమపై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కక్షతో యుగంధర్‌ను హత్య చేయాలని నిందితులు పథకం రచించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ క్రమంలో మారుతి సుజుకి బాలెనో కారు (AP 03 CG 1149)లో కె.ఎం. పురం నుంచి కార్వేటినగరం వైపు వస్తున్న నిందితులు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనంపై వస్తున్న యుగంధర్, ప్రభుదాస్‌లను గుర్తించారు. కారును వెనక్కి తిప్పి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో యుగంధర్ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభుదాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నలుగురు నిందితుల అరెస్ట్

ఈ కేసులో A1 బి. ప్రదీప్ రాజు, A2 బి. దిలీప్ రాజు, A3 బి. లీలా కుమార్ అలియాస్ లీలా కృష్ణ, A5 బి. విజయ అలియాస్ బి. విజయలక్ష్మిలను నవంబర్ 10న మధ్యాహ్నం 1.30 గంటలకు అమ్మాపల్లి క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన నిందితుల వివరాలు:

బి. ప్రదీప్ రాజు – 29 సంవత్సరాలు.

బి. దిలీప్ రాజు – 32 సంవత్సరాలు.

బి. లీలా కుమార్ అలియాస్ లీలా కృష్ణ – 25 సంవత్సరాలు.

బి. విజయ అలియాస్ బి. విజయలక్ష్మి – 55 సంవత్సరాలు.

ఈ కేసులో A4 రవి కుమార్ రాజు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు!

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హత్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని చిత్తూరు జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.

కేసు నంబర్: Cr.No.79/2026, సెక్షన్ 103(1) r/w 3(5) BNS.