సత్య వెలుగు న్యూస్, పుత్తూరు నవంబర్ 3:
చిత్తూరు: ట్రాక్టర్ ట్రైలర్‌ను టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్సై అశోక్ తెలిపారు.
ఎస్సై అశోక్ కథనం మేరకు.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చెర్లోపల్లి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తవణంపల్లి మండలం మొదలపల్లి గ్రామానికి చెందిన చెంచు నాయుడు తన ట్రాక్టర్లో రాతి కూసాలను రవాణా చేస్తుండగా, వెనుక ఉన్న ట్రైలర్‌కు రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి సమయంలో రిఫ్లెక్షన్ కనిపించలేదు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ట్రాక్టర్ ట్రైలర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణిస్తున్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల వివరాలు:
సందీప్ (33) – జోడిచింతల గ్రామం, యాదమరి మండలం.
జితేంద్ర (17) – బీహార్ రాష్ట్రం.
బాలు (40) – మొదల హరిజనవాడ, తవణంపల్లి మండలం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తాలూకా ఎస్సై అశోక్ వెల్లడించారు.