sathyavelugu.com
Date of Publish : 13 November 2026, 9:12 pm Posted by : Dr. S.sudhakar

తుఫాను బాధిత విద్యార్థులకు సిపార్డ్ ఆధ్వర్యంలో విద్యా కిట్ల పంపిణీ!

బాపట్ల, నవంబర్ 13, సత్య వెలుగు న్యూస్ : ఇటీవల సంభవించిన తుఫాను ప్రభావంతో నష్టపోయిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు బాపట్ల ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (సిపార్డ్) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విద్యా కిట్లను పంపిణీ చేశారు.

స్థానిక టీచర్స్ కాలనీలోని సిపార్డ్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెజాన్ సంస్థ సహకారంతో, డొనేట్ కార్ట్ ఫౌండేషన్ ద్వారా సమకూరిన విద్యా కిట్లను సిపార్డ్ డైరెక్టర్ కె. రవి ప్రదీప్ విద్యార్థులకు అందజేశారు.

కొండుబోట్లవారిపాలెం, ముత్తాయపాలెం ప్రాంతాలకు చెందిన మొత్తం 80 మంది విద్యార్థులకు లెదర్ బ్యాగ్, వాటర్ బాటిల్, స్కెచ్ పెన్నుల సెట్, నోట్‌బుక్స్‌తో కూడిన విద్యా కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముత్తాయపాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తుఫానులు, వరదలు సంభవించినప్పుడు సాధారణంగా ప్రజలు నిత్యావసర వస్తువులపైనే దృష్టి సారిస్తారని, అయితే విద్యార్థుల పుస్తకాలు, విద్యా సామగ్రి దెబ్బతిన్న విషయాన్ని గుర్తించి సిపార్డ్ సంస్థ ప్రత్యేకంగా విద్యా కిట్లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపార్డ్ సంస్థ ఏరియా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ. శ్రీనివాసరావు, కె. కిషోర్, పి. రామకృష్ణ, పి. జ్యోతి, ఎస్.కె. సలీం తదితరులు పాల్గొన్నారు.

విపత్తుల సమయంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.