sathyavelugu.com
Date of Publish : 13 November 2026, 5:26 pm Posted by : Dr. S.sudhakar

ప్రభుత్వ భూమిలో అక్రమ గృహ నిర్మాణం.. అధికారుల నిర్లక్ష్యంపై దళిత, గిరిజన సంఘం ఆగ్రహం!

వడమల పేట, నవంబర్ 13 , సత్య వెలుగు న్యూస్:

వడమాలపేట: మండలంలోని సీతారామపురం లెక్కదాఖలా గంగూరివారి కండ్రిగ వద్ద గుట్ట పోరంబోకు ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గృహ నిర్మాణం జరుగుతోందని, దీనిపై సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై. నందయ్య డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ధనబలం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికే స్థానిక ప్రజలు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, స్థానిక రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఇకనైనా వడమాలపేట తహసీల్దార్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, సంబంధిత ప్రభుత్వ భూమిని పరిశీలించి, అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

లేనిపక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వడమాలపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉద్యమిస్తామని వై. నందయ్య హెచ్చరించారు.