sathyavelugu.com
Date of Publish : 11 November 2026, 9:52 pm Posted by : Dr. S.sudhakar

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కుల హననం: సీపీఐ, సీపీఎం ఆగ్రహం!

-చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు: వామపక్ష నేతలు

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 11: స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ప్రతిపక్ష అభ్యర్థులకు బెదిరింపులు, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు బుధవారం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీఐ డివిజన్ కార్యదర్శి డి. మహేష్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో కార్మికులు, ప్రజల సత్తా ఏమిటో కూటమి ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోపి, కృష్ణారెడ్డి, రవి, సీపీఎం నాయకులు నందయ్య, విజయ్, శివ తదితరులు పాల్గొన్నారు.