sathyavelugu.com
Date of Publish : 11 November 2026, 4:45 pm Posted by : Dr.K.Suresh Editor

ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా పల్లం రాఘవులు నియామకం

-పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – నాయకుల ఆకాంక్ష

నాయుడుపేట, నవంబర్ 11 ,సత్య వెలుగు న్యూస్:

ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా పల్లం రాఘవులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు రవి కలిసి పల్లం రాఘవులుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు నియోజకవర్గ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తూ నియామకాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పల్లం రాఘవులుకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.బి. రాజు, పెళ్లకూరు మండల కన్వీనర్ నందిమండలం మోహన్ రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతనంగా నియమితులైన పల్లం రాఘవులుకు శుభాకాంక్షలు తెలిపారు.