-పోక్సో చట్టంపై విద్యార్థినులకు న్యాయ అవగాహన కల్పించిన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి
సత్య వెలుగు , సూళ్లూరుపేట: నాయుడుపేట మండలం బిరదవాడ బాలికల గురుకుల పాఠశాలలో నాయుడుపేట జేఎంఎఫ్‌సీ కోర్టు ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి విద్యార్థినులకు బాలల హక్కులు, భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు తమ హక్కులు, రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు లేదా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని, అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. బాలల రక్షణకు పోక్సో చట్టం ఎంతో కీలకమని వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ సీఐ టి. వెంకటరమణ, న్యాయవాదులు మాధవి, సునీల్, సుమన్, మల్లికార్జున తదితరులు పాల్గొని విద్యార్థినులకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.