sathyavelugu.com
Date of Publish : 13 November 2026, 6:47 pm Posted by : Tupili.Nagaraju

నాయుడుపేట గరిడి వీధిలో అపరిశుభ్రత తాండవం.. డ్రైనేజీ చెత్త తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి!

సత్య వెలుగు న్యూస్, నవంబర్ 13 :

నాయుడుపేట పట్టణంలోని గరిడి వీధిలో డ్రైనేజీ కాలువల నుంచి తొలగించిన చెత్త వారం రోజులుగా రోడ్డు పక్కనే పేరుకుపోయి ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డ్రైనేజీ నుంచి తీసిన చెత్తను వెంటనే తరలించకుండా అక్కడే వదిలేయడంతో విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు అధికమై ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఆ చెత్తపై నుంచి బైకులు, ఆటోలు రాకపోకలు సాగించడంతో చెత్త రోడ్డంతా వ్యాపించి పరిసరాలు మరింత అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇళ్ల సమీపంలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి:

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గరిడి వీధిలో పేరుకుపోయిన డ్రైనేజీ చెత్తను వెంటనే తొలగించి, రోడ్లను శుభ్రం చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత కావాలి.. అధికారులు తక్షణమే స్పందించాలి!