-నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులు, పోలీసుల వేధింపులపై ఫిర్యాదు
సత్య వెలుగు న్యూస్ , నవంబర్ 12 , సూళ్లూరుపేట RC ప్రతినిధి :
తాడేపల్లి: నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డికి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో పాటు, పార్టీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కిలివేటి సంజీవయ్య, రాజేశ్వరమ్మతో పాటు పార్టీ నాయకులను అభినందించారు.
నాయకులు, కార్యకర్తల సమస్యలను సజ్జల దృష్టికి..
ఈ భేటీలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులు, పోలీసుల వేధింపుల అంశాలను కిలివేటి సంజీవయ్య సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తనపై సీఐ దాడి చేసిన ఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు. ఈ ఘటనలపై పూర్తి సమాచారంతో రూపొందించిన ఫిర్యాదు పత్రాన్ని సజ్జలకు అందజేశారు.
నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా నిలవాలని, బాధితులకు న్యాయం జరిగేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించినట్లు తెలిసింది.
పలువురు పార్టీ నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు తంబిరెడ్డి సుబ్బరమణ్యం రెడ్డి, కామిరెడ్డి మోహన్ రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బీరదవోలు శ్రీకాంత్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి, నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథరెడ్డి, నాయుడుపేట రూరల్ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి చదలవాడ కుమార్, గొట్టికాట రవీందర్ రెడ్డి, తంబిరెడ్డి సురేష్ రెడ్డి, విజల్ రెడ్డి, తంబిరెడ్డి హేమకుమార్ రెడ్డి, చంద్ర రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.